పున్నాగవనంలో పొన్నలు పొగడలు

updated: March 5, 2018 13:30 IST
పున్నాగవనంలో పొన్నలు పొగడలు

ఆదివారం (04-03-2018) ఉదయం 10.30 కు టాక్సీ వచ్చి సన్నీ రెసిడెన్సీ  ముందు ఆగింది. అప్పుడే నేను లిఫ్ట్ ఎక్కి 5వ అంతస్తులోని సౌజన్యమూర్తి శ్రీ రావి కొండలరావు గారి ఫ్లాట్ వద్దకు చేరుకున్నాను. గురువుగారు తయారుగా వున్నారు. ఈలోగా టాక్సీ డ్రైవరు వచ్చి డాక్టర్ సుబ్బారావు గారు పంపారని చెప్పారు. ఇద్దరం క్రిందికి దిగి టాక్సీ ఎక్కాము. దారిలో నవ్య సంపాదకులు శ్రీ జగన్నాథ శర్మ గారిని, డబ్బింగ్ ఆర్టిస్ట్ కుమారి కృష్ణవేణి ని ఎక్కించుకుని త్యాగరాయ గానసభా ప్రాంగణానికి ప్రయాణం సాగించాం. శర్మ గారు అడిగారు “అసలు మనం ఎందుకు వెళుతున్నట్లు. ఆహ్వాన పత్రిక ఉందా? అక్కడ మన పాత్ర ఏమిటి?” అంటూ ఎన్నో ప్రశ్నలు. మాకూ చూచాయగా తెలుసు... అక్కడ ఏదో సంబరం జరుగుతోందని, కొండలరావు గారికి, వీరాజి గారికి, జగన్నాథశర్మ గారికి సన్మానం జరుగుతుందని. ఆ వేడుక సంధానకర్త అమెరికాలో ఉంటున్న సాహిత్యాభిలాషి, స్నేహశీలి, ప్రవాస భారతీయుడు డాక్టర్ సుబ్బారావు గారని. హైదరాబాదులో యాభై వేలకు పైగా పెళ్ళిళ్ళు జరుగుతున్న రోజు ఈ ఆదివారం. అందరికీ ఏదో ఒక పెళ్ళికి వెళ్ళాల్సిన ఆహ్వానం వుండే వుంటుంది. ఈ కార్యక్రమానికి ఎందరొస్తారులే అని చర్చించుకుంటూ ఉంటుండగానే త్యాగరాయ గానసభ వద్దకు చేరుకున్నాం. టాక్సీ తలుపు తీయగానే అద్భుత ఆత్మీయ స్వాగతం...సంపెంగ వాసనలు గుప్పున కమ్మేశాయి. నిర్వాహకులు చేతులు పట్టుకొని మరీ నడిపించారు సభాస్థలికి. సముచిత స్థానంలో ఆశీనులమయ్యాం. నిర్వాహకులకు అన్ని పూలు ఎక్కడ లభించాయో తెలియదు (వేలాది పెళ్ళిళ్ళు జరుగుతున్నందున పూల లభ్యత అరకొరగానే వుంది హైదరాబాదు నగరంలో). రంగురంగుల పూలతో వేదిక అద్భుతంగా అలంకరించి వుంది. ఆహూతులంతా మధ్య వయస్కులు, యాభయ్యో పడిలో వున్నవారు ఎక్కువ. వారిలో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవడు,

 

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి పెద్దబ్బాయి, ఇండియా టుడే చెన్నై సంపాదకుడు వంటి ఎందఱో మహానుభావులున్నారు వారిలో. పెద్ద సంఖ్యలో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో చీరలు సింగారించి, జడలు వేసుకుని, సిగలో పూలతో తెలుగుదనం నింపుకుని ఆశీనులయ్యారు. వేదిక మీద ఫ్లెక్స్ బోర్డు ప్రత్యక్షం. పొన్నాడ వారి పున్నాగవనం, బాపు రమణీయ లోగిలి, బాపు రమణీయం వంటి పేర్లతో బాపు బొమ్మలతో నిండివుంది. అక్కడకు చేరుకున్నాక తెలిసింది... అది ఒక ఆత్మీయ సమ్మేళనమని, అందులో ఆహ్వానితులంతా ‘పొన్నాడవారి పున్నాగవనం’ అనే ఫేస్ బుక్ సమూహంలో సభ్యులని. ఈరోజుల్లో పక్కింటి వాళ్ళు గాని, సొంత కొడుకులుగాని తమ స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా పలకరించలేని అయోమయస్థితిలో ఉంటుండగా, ఎక్కడెక్కడినుండో వచ్చి ఆత్మీయంగా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ, పలకరించుకుంటూ వుంటే మాకు చిన్నతనంలో అనుభవించిన ఆత్మీయ అనుబంధాలు గుర్తుకొచ్చాయి. విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, చెన్నై, రాయలసీమ, ఇతర దేశాల నుంచి సభ్యులు వందల సంఖ్యలో రావడం ఆ ఫేస్ బుక్ సమూహం యొక్క స్నేహబంధాన్ని గుర్తు చేసింది. శ్రీ రావి కొండలరావు, శ్రీ వీరాజి, శ్రీ జగన్నాథ శర్మలకు అద్భుతమైన సత్కారం జరిగింది. వారి ప్రక్కనే వున్న నాకు, కృష్ణవేణి కూడా ఆ సత్కారం జరిపారు డా||సుబ్బారావు గారు. శ్రీ జగన్నాథ శర్మ గారు జర్నలిజం మీద మక్కువతో యెలా తనను తాను తీర్చి దిద్దుకున్నది, నవ్య వంటి సకుటుంబ వారపత్రికకు ఎలా సంపాదకునిగా ఎదిగింది, వీరాజీ గారు యిచ్చిన వాత్సల్యపూరిత సలహాలు తనకు యెలా ఉపకరించింది అనే విషయాలను చక్కగా వివరించి ఆహూతులనుంచి అభినందనలు అందుకున్నారు.

 

వీరాజీ గారు జర్నలిజం లోతుపాతులను సోదాహరణంగా వివరించారు. కృష్ణవేణి శ్రీ రావి కొండలరావు గారిని సభకు పరిచయం చేస్తూ తనదైన శైలిలో వారి రచనాప్రస్థానం నుంచి, నటప్రస్థానం వరకు అద్భుత వర్ణనతో ఆకట్టుకుంది. తరవాతి వంతు శ్రీ రావి కొండలరావు గారిది. “సైలెన్స్” అంటూ మైకు వద్దకు వచ్చి తెలుగు మేస్టారి “ఆనప్పాదు” సంవాదంతో సభికులను పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు. అసలైన కథ ఆతరవాతే మొదలైంది. సరిగ్గా రెండుగంటలకు భోజన విరామం ప్రకటించారు. వేదిక దిగివచ్చి బంతి భోజన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయాం. ‘తోపుడు తిండి’ (బఫెట్ భోజనం) కానందుకు డాక్టర్ సుబ్బారావు గారిని మనసారా అభినందించం. బల్లలు వేసి శుభ్రంగా కడిగిన అరిటాకులు పరిచారు. చక్కర పొంగలి, పుళిహోర, పెరుగు గారె, నేతి బొబ్బట్టు, పనసపొట్టు ఆవకూర, మామిడి పప్పు, గోంగూర, వంకాయ కూర, కందిపచ్చడి, ఊర మిరపకాయలు, గడ్డపెరుగు, అప్పడాలు..... ఒకటేమిటి తెలుగువాడు ఇష్టపడే వంటకాలను వద్దంటే వడ్డిస్తుంటే... పాతరోజుల్లో పల్లెటూర్లల్లో వడ్డించే పెళ్లిభోజనాలు గుర్తుకొచ్చాయి. చక్కెరకేళి అరటిపండు తో ‘ఫినిషింగ్ టచ్’!!! భోజనకార్యక్రమం సాగుతూవుంటే మంద్రస్థాయిలో కొందరు అద్భుతమైన ఆపాత మధురాలను ఆలపిస్తూ వున్నారు. తరవాత ఫోటోలు తీసుకోవడం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడంతో గంటల కాలం నిమిషాల్లా గడచిపోయింది. సెలవు తీసుకొని వెళ్లొస్తామంటే చేతిలో ఒక సంచి, దాని నిండా పూతరేకులు, బెల్లం గవ్వలు, పాలకోవాలు, మడత కాజాలు, అరిసెలు, రేగుపండు లేహ్యం, చక్కరకేళీలు నింపి కారువద్దకు తీసుకొచ్చి ఆప్యాయంగా ఇచ్చి మాకు వీడ్కోలు పలికారు. నెల్లూరు నుంచి వచ్చిన శ్రీమతి నిమ్మి మధుబాల మాకందరికీ ‘బొబ్బిలి వీణలు’ డాక్టర్ సుబ్బారావు గారిచేత బహూకరింపజేసింది. సమయం నాలుగు దాటింది. అందరివద్దా సెలవు తీసుకుని ఆస్వాదించిన మధుర క్షణాలను చర్చించుకుంటూ ఇల్లుచేరాము. ఈ కార్యక్రమ నిర్వాహకులు అతిధులకు సంపెంగ పూలు చేతుల్లో పెట్టి మా అనుభూతులకు సువాసనలు అద్దడం కొసమెరుపు. సాహో.... పొన్నాడ వారి పున్నాగవన సభ్యులు.

.... ఆచారం షణ్ముఖాచారి

comments